టమాటా నిల్వ పచ్చడి: రుచికరమైన, ఎక్కువ రోజులు నిల్వ ఉండే పద్ధతి!
ప్రతి ఇంట్లో టమాటాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటితో చాలా మంది నిల్వ పచ్చళ్లు పెడుతుంటారు. కొందరు ఉడికించి పెడితే, మరికొందరు ఎండబెట్టి తయారు చేస్తారు. అయితే, ఏ పద్ధతిలో పెట్టినా రుచి సరిగా రాలేదని లేదా త్వరగా పాడవుతుందని బాధపడుతుంటారు. దీంతో టమాటాలతో పచ్చళ్లు పెట్టడం మానేస్తారు. అలాంటి వారు ఈసారి మేము చెప్పే పక్కా కొలతలతో పచ్చడి పెట్టండి. రుచి అద్భుతంగా ఉంటుంది, పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
- నాటు టమాటాలు – 1 కేజీ
- మెంతులు – 1 టీ స్పూన్
- ఆవాలు – 2 టీ స్పూన్లు
- జీలకర్ర – 1 టీ స్పూన్
- చింతపండు – 100 గ్రాములు
- రాళ్ల ఉప్పు – అర కప్పు (100 గ్రాములు)
- వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు
- పసుపు – అర టీ స్పూన్
- కారం – 100 గ్రాములు
తాలింపు కోసం:
- నూనె – 400 ml
- శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
- మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – 2 టీస్పూన్లు
- జీలకర్ర – 1 టీ స్పూన్
- ఎండుమిర్చి – 6
- ఇంగువ – పావు టీ స్పూన్
- కరివేపాకు – గుప్పెడు
- వెల్లుల్లి రెబ్బలు – 15
తయారీ విధానం:
- టమాటాలను శుభ్రంగా కడిగి, నీరు లేకుండా తుడుచుకోవాలి. మీడియం సైజులో ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
- స్టవ్ మీద కడాయి పెట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.
- అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. టమాటాలోని నీరు పూర్తిగా ఇంకిపోయాక చల్లారనివ్వాలి.
- మిక్సీ జార్‌లో వేయించిన పొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
- తాలింపు కోసం కడాయిలో నూనె వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. కరివేపాకు క్రిస్పీగా వేగాలి.
- తాలింపులో ఉడికించిన టమాటా మిశ్రమం వేసి 5 నిమిషాలు వేయించాలి.
- చల్లారాక గ్రైండ్ చేసిన కారం మిశ్రమం వేసి బాగా కలపాలి.
- తడి లేని డబ్బాలో నిల్వ చేసి ఒకరోజు ఊరనివ్వాలి.
చిట్కాలు:
- టమాటాలు నాటువి అయితే పచ్చడి రుచిగా ఉంటుంది.
- కరివేపాకును క్రిస్పీగా వేయించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
- పచ్చడిని తడి తగలకుండా నిల్వ చేయాలి.
- మీరు ఈ పచ్చడిని ఇడ్లీ , దోశ లోకి కూడా ఉపయోగించవచ్చు.
ఈ పద్ధతిలో టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసి, రుచి చూడండి.