కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ శాఖ అధికారులకు మరిన్ని ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను అధికారులకు ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్, ఆన్‌లైన్ పెట్టుబడులు, పన్ను చెల్లింపుదారుల ట్రేడింగ్ ఖాతాల వివరాలను అడిగే అధికారం ఉంటుంది. పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉండటం లేదా లెక్కల్లో చూపని బంగారం మరియు డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే, వారు సంబంధిత వ్యక్తుల ఖాతాలను తనిఖీ చేయగలరు. కొత్త బిల్లులో ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను తీసుకువచ్చింది.
డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో, ఈ మార్పు ఉద్దేశ్యం పన్ను ప్రక్రియలో ఆర్థిక మోసం, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతను నిరోధించడమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరైనా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడితే, వారు సోదాలు, తనిఖీలు నిర్వహించవచ్చు. పత్రాలు, ఆర్థిక వివరాల కోసం లాకర్లను బద్దలు కొట్టే అధికారం వారికి ఉంది. అదనంగా కొత్త బిల్లు వ్యక్తుల డిజిటల్ పరికరాలను తనిఖీ చేయడానికి కూడా అనుమతిస్తుంది.