US Tarif: భారతీయ ఎగుమతులపై అమెరికా పరస్పర సుంకాల ప్రభావం తక్కువే

వాణిజ్య ఆంక్షలపై ఆందోళనలు ఉన్నప్పటికీ భారత ఎగుమతులపై అమెరికా పరస్పర సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రభుత్వ రంగ SBI అంచనా వేసింది. తమ ఉత్పత్తులపై పన్నులు విధించే దేశాలకు పరస్పర సుంకాలు అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారు. భారతదేశం మిత్రదేశమైనప్పటికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. అయితే, అమెరికా పరస్పర సుంకాల ప్రభావం మన ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపదని SBI చెబుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. అమెరికా భారతీయ ఉత్పత్తులపై గరిష్టంగా 15-20 శాతం సుంకాలను పెంచినప్పటికీ, మన ఎగుమతులపై 3-3.5 శాతం ప్రభావం మాత్రమే ఉంటుంది. మరిన్ని ఎగుమతులను పెంచడం ద్వారా కూడా ఈ భారాన్ని తగ్గించవచ్చు. అదనంగా వ్యూహాత్మకంగా ఎగుమతులను వైవిధ్యపరచడం. కొత్త వాణిజ్య మార్గాలను స్వీకరించడం ద్వారా అమెరికా విధించే పరస్పర సుంకాల ఒత్తిడిని తగ్గించవచ్చని SBI నివేదిక వివరిస్తుంది. దీని కోసం యూరప్, మధ్యప్రాచ్యంతో సహా ఇతర దేశాలకు సరఫరా సామర్థ్యాన్ని పెంచాలని తద్వారా ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగించాలని నివేదిక సూచిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గణాంకాల ప్రకారం.. మన దేశ ఎగుమతులపై అమెరికా విధించే సగటు సుంకం 3.3 శాతం కాగా, అమెరికా ఎగుమతులపై మనం విధించే సగటు సుంకం 17 శాతం. మరోవైపు.. అమెరికా మన దేశానికి ఎగుమతి చేసే 75 శాతం ఉత్పత్తుల విలువపై సగటు సుంకం 5 శాతం కంటే తక్కువ. ఫలితంగా అమెరికా మళ్లీ సుంకాన్ని పెంచినప్పటికీ, ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు భావిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల్లో 17.7 శాతం వాటాతో అమెరికా భారతదేశం ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. అయితే, భారతదేశం కొంతకాలంగా అమెరికా వంటి ఒకే మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్యం, ఇతర ప్రాంతాలతో పెరుగుతున్న వాణిజ్య సంబంధాలతో, సరఫరా నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తోంది.