మాఘమాసం ప్రారంభంతో దేశవ్యాప్తంగా వివాహాలు జోరుగా జరుగుతున్న తరుణంలో పెరిగిన బంగారం ధరలు ప్రజలను, మహిళలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. గత రెండు నెలలుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. కానీ, సోమవారం బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దీనితో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 79,800కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 390 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ. 87,060కి చేరుకుంది.
దీంతో చరిత్రలో తొలిసారిగా బంగారం 87 వేల మార్కును తాకింది. ఇంతలో వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,07,000. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ జరుగుతుండటంతో నిరంతరం పెరుగుతున్న బంగారం ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ప్రతి పెళ్లిలోనూ బంగారం తప్పనిసరి కాబట్టి, పెరిగిన ధరను ప్రజలు భరించలేకపోతున్నారు. ఈ ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, త్వరలో ఒక పౌండ్ బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనా.