ఈ సంవత్సరం ఈ-రిక్షా విభాగంలోకి ప్రవేశించడానికి బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తోంది. ఇది అసంఘటిత రంగం అయినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే నెల చివరి నాటికి ఈ-రిక్షాలకు అవసరమైన నియంత్రణ అనుమతులు లభిస్తాయని, నెలకు 45,000 వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ‘ఈ-రిక్షా’ పేరుతో కొత్త వాహనాలను తీసుకువస్తామని, ఇది రిక్షా విభాగంలో పూర్తిగా కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని, కొనుగోలుదారులతో పాటు ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందిస్తుందని కంపెనీ వివరించింది.
ఏప్రిల్ మొదటి వారంలో ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు రాకేష్ శర్మ తెలిపారు. ఈ-రిక్షా వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా కొత్త వ్యాపారాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాము అని తెలిపారు. ఇంతలో, గత సంవత్సరం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో 6,32,634 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో అమ్మకాలు, గత సంవత్సరం కంటే 57 శాతం ఎక్కువ. కాగా, వాహన్ డేటా ప్రకారం..ఫిబ్రవరి 6, 2025 నాటికి ఈ విభాగంలో మొత్తం 424 కంపెనీలు ఉన్నాయి. అయితే, మహీంద్రా & మహీంద్రా, అతుల్ ఆటో, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీలు వాటిలో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి.