ఏపీలో రెండు నుంచి మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల పీడనం ఏర్పడటం వల్ల ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వర్ష సూచన జారీ చేసింది. ఏపీకి తాజా వాతావరణ నివేదికను తెలుసుకుందాం…
మళ్ళీ ఏపీకి వర్ష సూచన.. సంక్రాంతి నాడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల పీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో వ్యాపించిందని చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులు వర్షాలు కురుస్తాయి. అయితే, ఉత్తర కోస్తాలో మరో రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ఉపరితల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే, ఏపీలో చాలా చోట్ల మరో మూడు నుంచి నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, వైఎస్ఆర్, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉదయం పొగమంచు ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు ఉదయం పొగమంచు ఉండే అవకాశం ఉందని కూడా వెల్లడించారు.