ఆసియాలోనే అత్యంత పురాతనమైన చర్చి… మెదక్ చర్చికి వందేళ్ళు
ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన చర్చి మెదక్ క్యాథడ్రిల్ చర్చి. మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మించి 100 ఏళ్ళు పూర్తయ్యాయి. అయినా ఎక్కడ కూడా కొంచెమైనా చెక్కుచెదరలేదు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ క్యాథడ్రిల్ చర్చ్‌పై ప్రత్యేక కథనం.
క్రిస్మస్ వస్తుందంటే…క్రిస్టియన్ల కుటుంబాల్లో సందడి మొదలవుతుంది. క్రిస్టియన్ల అతి పెద్ద పడగ అయిన క్రిస్టమస్ కోసం చర్చిలను కూడా సుందరంగా తీర్చి దిద్దుతారు.
ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన చర్చి…ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చర్చి అయిన మెదక్ క్యాథడ్రిల్ చర్చి కూడా క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యింది. ఈసారి మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మాణం పూర్తయ్యి…వందేళ్ళు పూర్తి కావడం ఇక్కడ మరో విశేషం.
ఏంటి మెదక్ చర్చి కథ..?
మెదక్ చర్చ్ నిర్మాణం వెనుక ఓ మానవీయమైన కథ ఉంది. గుప్పెడు మెతుకుల కోసం…తల్లడిల్లిన ప్రజల వ్యధ ఉంది.
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. చాలా మంది పేదలు అగ్రరాజ్యాల ఆధిపత్యపోరులో నలిగిపోయారు. వారి సామ్రాజ్య కాంక్షకు సమిధలయ్యారు. ఇందుకు ఇండియా కూడా మినహాయింపు కాదు. ఎంతో మంది ప్రజలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటించారు. 1914లో ఈ విషయం చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడిని కదిలించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చర్చిని నిర్మిస్తే…ఆ కూలి డబ్బులతో కొంత మంది కడుపైనా నింపొచ్చని చార్లెస్ వాకర్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా…చందాలు చేసి…చర్చి నిర్మాణానికి పూనుకున్నారు. అలా మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మాణం మొదలు పెట్టారు. పదేళ్ళపాటు…దాదాపు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఇలా ఆ కూలీలకు ఉపాధి కల్పించడమే చార్లెస్ వాకర్ ముఖ్య ఉద్దేశం.
పదేళ్ళ తర్వాత 1924 డిసెంబర్ 25న మెదక్ క్యాథెడ్రల్ చర్చి నిర్మాణం పూర్తయ్యింది. ఈ చర్చి నిర్మాణం సమయంలో మెదక్‌కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందంటారు. ఈ చర్చి కోసం ఆరో నిజాం 1000 ఎకరాల స్థలం ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ అంత స్థలం లేదు.
అప్పట్లో మెదక్ క్యాథడ్రిల్ చర్చి నిర్మాణం కోసమే 14 లక్షల రూపాయలు ఖర్యయ్యిందట. కొంత కాలం కిందట 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారు.
నిర్మాణ విశిష్టత
మెదక్ క్యాథడ్రిల్ చర్చి 175 అడుగుల ఎత్తు…100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాలు ఉట్టిపడేలా నిర్మించారు. రంగు రంగుల గాజు ముక్కలతో…చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
క్రీస్తు పుట్టుక, శిలువ, ఆరోహనం ఇలా ప్రతి ఘట్టాన్ని ఇక్కడి పెయింటిగ్ర్‌లో చూడొచ్చు. ఇవి ఒకే గాజుపై వేసినవి కావు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి…ఇక్కడికి తీసుకువచ్చి అమర్చారట. ఇవి సూర్యుడి కిరణాలు పడితేనే కనిపిస్తాయి. సూర్యుడి లేనప్పుడు ఫ్లడ్ లైట్లు వేసి వెతికినా…ఈ పెయింటింగ్స్ కనిపించవు. దీని వెనుక సైన్స్ రహస్యం దాగి ఉందంటారు.
ఈ మెదక్ చర్చిలో మరో విశేషం కూడా ఉంది. ఉత్తరం దిక్కున ఉన్న మూడో కిటికీపై అసలు సూర్య కిరణాలు పడకున్నా అది ప్రకాశిస్తుంది. అక్కడి రాళ్ళపై కిరణాలు పడి…వక్రీభవించి కిటికీపై పడటం వల్ల ప్రకాశిస్తుందంటారు నిపుణులు. ఈ చర్చి నిర్మాణం కోసం వాడిన మార్బుల్స్ ఇటలీ, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించారట. రాతి, డంగు సున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్థుల్లో 200 అడుగుల పొడవుతో సువిశాలమైన మెదక్ చర్చి అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్‌ను తెప్పించడం విశేషం..బ్రిటన్ నుండి మొజాయిక్ టైల్స్, ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ మేషన్లు తీసుకొచ్చారు. అలాగే యాష్ కలర్‌లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీతో పాటు మొత్తం భవనానికి పిల్లర్లుగా ఉన్నాయి. చర్చి పై కప్పును బోలు స్పాంజ్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. దీంతో అది సౌండ్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఇక 175 అడుగుల ఎత్తులో ఉండే బెల్-టవర్ కూడా చాలా దూరం నుంచే కనపడుతుంది..
ఈ కేథడ్రల్ చర్చి వెస్లియన్ మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలతో ఏర్పాటైన దక్షిణ భారత దేశంలోని బిషప్ స్థానం కలిగిన చర్చి. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇది గోతిక్ నిర్మాణ శైలితో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్రముగ్ధులను చేస్తుంది. క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్డ్ గ్లాస్ విండోలు.
చర్చిలోపలికి వెళ్లగానే రంగు రంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడ పశ్చిమ ట్రాన్‌సెప్ట్‌లో క్రీస్తు జననం, తూర్పు ట్రాన్‌సెప్ట్‌లో సిలువ వేయడం వంటివి చూడొచ్చు. దీంతో ఈ అద్భుతమైన కేథడ్రల్ చర్చిలో నిష్కళంకమైన హస్తకళలు కూడా ఉన్నాయి..
కొబ్బరి కాయలు కొట్టే చర్చి
ప్రపంచంలో ఏ చర్చిలో లేని విధంగా…ఇక్కడ కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి పద్దతి మరెక్కడా లేదు. మెదక్ కెథడ్రిల్ చర్చి పూర్తయ్యి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ విశాలమైన చర్చిలో ఒకేసారి 6,000 మంది కూర్చుని ప్రార్థనలు చేసుకోవచ్చు. గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ పర్వదినాల్లో ఈ చర్చిని విదేశియులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఈ చర్చికి క్రైస్తవులే కాదు…అన్య మతస్థులు కూడా వస్తూ ఉంటారు.