ఈ భూమిపైకి ఎప్పడు మహమ్మారి వచ్చినా అది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే తేలింది ఇదే.
1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్పానిష్ ఫ్లూని “అన్ని అంటువ్యాధుల తల్లి” అని కూడా పిలుస్తారు. ఇది 50 మిలియన్లకు పైగా మరణాలకు కారణమైంది.
కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది. లక్షలాది మందిని చావు అంచుల్లోకి నెట్టేసింది. ఇది దాదాపు యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అయినప్పటికీ ఈ ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ ఆగడం లేదు. ఇప్పుడు మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి భవిష్యత్తులో ప్రజలను వెంటాడవచ్చని WHO హెచ్చరిస్తోంది. ‘డిసీజ్ ఎక్స్’గా పిలిచే ఈ వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీన్ని నిరోధించేందుకు ప్రపంచం మొత్తం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ‘ఎక్స్’ వ్యాధికి సంబంధించిన భయంకరమైన విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పేరులేని ఈ మహమ్మారి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఏ రూపంలోనైనా దాడి చేయగలదని WHO హెచ్చరిస్తోంది. ఈ దాడి ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అందరూ అంటున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లను తగ్గించుకుని మంచి పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.