YS Jagan : జగన్ జిల్లాల పర్యటనకు బ్రేక్.. వైసీపీలో నిరాశ!

జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? సంక్రాంతి మూడో వారంలో ఉంటుందా? తర్వాత అవుతుందా? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి మూడో వారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ ప్రకటించారు. వారంలో రెండు రోజుల పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మకాం వేయనున్నట్లు తెలిపారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు రెండో వారం దగ్గరపడుతున్నా ఎలాంటి ప్రిపరేషన్ లేదు. పైగా జగన్ జిల్లాల పర్యటన ఇప్పుడప్పుడే కాదని తాజా పరిణామాలతో తేలిపోయింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒకరకమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

* జనవరి మూడో వారంలో ప్రచారం
ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పలువురు నేతలు వెళ్లిపోయారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కూటమి దూకుడుకు పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. కేసులు, దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించేందుకు జిల్లాల పర్యటనకు జగన్ ఆలోచన చేశారు. వారంలో రెండు రోజులు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గడపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచేందుకు అధినేత ముందుకు రావడాన్ని స్వాగతించారు.

* విదేశీ పర్యటనల కోసం..
అయితే జగన్ జిల్లాల పర్యటన జనవరిలో ఉండదని ఇప్పుడు తేలిపోయింది. ఈ నెల 11 నుంచి 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నెల 8న కోర్టులో విచారణ జరగనుంది. దీని ప్రకారం జగన్ విదేశీ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. కోర్టు అనుమతిస్తే ఈ నెల మొత్తం విదేశాల్లోనే గడపనున్నారు. నెలాఖరులో రాష్ట్రానికి చేరుకోనున్నారు. అప్పటికప్పుడు జిల్లాల పర్యటన సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఫిబ్రవరి లేదా మార్చిలో జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో పార్టీ వర్గాల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Related News