తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త అందించారు.
స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తూర్పు ద్వారం ముందు వికలాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు కూర్చునేందుకు బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు. వీరికి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.
వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులను ప్రత్యేక క్యూ లైన్‌లోకి తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఆలయ సిబ్బంది స్వయంగా తెలిపారు. దీంతో వీరంతా క్యూ లైన్లలో పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి పొందనున్నారు. అదేవిధంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.