గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివని తెలిసిందే. అందుకే వైద్యులు ప్రతిరోజూ ఒక గుడ్డు తినమని సిఫార్సు చేస్తారు. చాలా మంది ఉదయం టిఫిన్‌గా గుడ్లు తీసుకుంటారు. గుడ్లలో లభించే విటమిన్లు ఎ, డి, ఇ, బి12, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, ఖాళీ కడుపుతో గుడ్లు తినడం మంచిది కాదని చెబుతారు.
ఉదయం గుడ్లు తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతారు. కడుపులో ఏమీ లేకుండా గుడ్లు తినడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలెర్జీలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. ముఖ్యంగా.. ఇది తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది.
కొంతమందిలో సగం ఉడికిన గుడ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి వస్తుంది. ఉదయం గుడ్లను టిఫిన్‌గా తీసుకుంటే, శరీరానికి అవసరమైన ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే అల్పాహారం సమయంలో గుడ్లను ఇతర ఆహారాలతో పాటు తీసుకోవాలి. గుడ్లు బాగా ఉడికిన తర్వాతే తినాలి. గుడ్లతో పాటు ఫైబర్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను టిఫిన్‌గా తీసుకోవాలి.