AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్యాకేజీ ప్రకటించింది. ముంపునకు గురైన ప్రతి ఇంటికి సాయం అందించాలని నిర్ణయించారు.
కొంతమందికి ఇప్పటికే సహాయం అందింది మరియు కొంతమందికి అందలేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని రేపు (సోమవారం) బ్యాంకుల్లో జమ చేస్తామని ప్రకటించింది.
సాయం అందని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు భారీ నష్టం వాటిల్లిందని వారికి అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందడం లేదని వాపోతున్నారు. దీంతో కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం బ్యాంకు ఖాతాల్లో సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 18 వేల కుటుంబాలకు గాను ఇప్పటికే 4 వేల కుటుంబాలకు లెక్కలు తేల్చి పరిహారం అందజేశామన్నారు.
మిగిలిన 14 వేల కుటుంబాలకు సంబంధించి సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం లెక్కలు తేల్చిందని, వారికి రెండు రోజుల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. వివిధ కారణాల వల్ల నష్టపరిహారం అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించారు. సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సర్దిచెప్పినట్లు తెలిపారు. పరిహారం కోసం కలెక్టరేట్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.