సినీ పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటి బిందు ఘోష్ (76) ఇక లేరు. ఆమె నిన్న (ఆదివారం) మధ్యాహ్నం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు (సోమవారం) జరిగాయి. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హాస్యనటి బిందు ఘోష్ వృద్ధాప్యంలో వివిధ సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఆమెకు చికిత్సలో సహాయం చేశారు. బిందు ఘోష్ తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో 300 కి పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భలారే విచిత్ర వంటి చిత్రాల్లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.