ఏపీ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కీలక హామీ ఇంకా అమలు కాలేదు. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేశారు.
ఆ వివరాలతో ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో అధికారులు చర్చించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పించాలనే దానిపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఈరోజు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంలోని మరికొన్ని అంశాలను అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. అయితే ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలు తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నందున వాటిని పరిష్కరించాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే ఉగాది నుంచి అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారులకు సూచించారు. దీంతో అధికారులు ఇతర రాష్ట్రాల నివేదికను తీసుకెళ్లి చంద్రబాబునాయుడుకు సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువ. గతంలో వైఎస్సార్‌సీపీ అమలు చేసిన అనేక పథకాలకు సంకీర్ణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో పెద్దగా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అందుకే ఉగాది నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అధికారులను కాన్ఫిడెంట్‌గా ఆదేశించినట్లు తెలుస్తోంది.