ప్రపంచంలో రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాలలో భారతదేశం నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. అలాంటి భారతీయ రైల్వేలలో అనేక అద్భుతాలు, లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మనం అత్యంత వేగవంతమైన రైళ్లను చూడవచ్చు. అలాగే, నెమ్మదిగా నడిచే రైళ్లు ఉన్నాయి. అతి చిన్న రైల్వే స్టేషన్లు, అతిపెద్ద రైల్వే స్టేషన్లు, ఎల్లప్పుడూ అత్యధిక ప్రయాణీకులతో రద్దీగా ఉండే స్టేషన్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు మనం అనేక అందమైన రైల్వే మార్గాలను చూడవచ్చు. వీటితో పాటు అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఒకటి లేదా రెండు మాత్రమే కాదు.. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. భారతీయ రైల్వేలలో, ప్రతి రైల్వే లైన్, స్టేషన్, రైలుకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక ప్రత్యేక రైలు గురించి తెలుసుకుందాం..
మన దేశంలో కేవలం 3 కోచ్‌లతో కూడిన రైలు కూడా ఉందని మీకు తెలుసా..? ఇది భారతదేశంలో అతి చిన్న ప్యాసింజర్ రైలుగా గుర్తింపు పొందింది. అది కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకులం జంక్షన్ వరకు ప్రయాణించే మూడు కోచ్‌ల DEMU రైలు. ఈ ఆకుపచ్చ రంగు DEMU రైలులో 300 మందికి సీట్లు ఉంటాయి. ఈ రైలు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. రైలు మార్గం కూడా చాలా అందంగా ఉంది. స్థానికులు దీనిని చూసి ఆనందిస్తారు. ఈ రైలు ఒకే స్టాప్‌తో 40 నిమిషాల్లో 9 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ, దీనిలో ఎక్కేవారు తక్కువ. ప్రయాణీకుల కొరత కారణంగా ఈ రైలును ఆపివేస్తారనే చర్చ జరుగుతోంది.