హైదరాబాద్ : వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్ లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అక్కడ ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే అత్యధిక ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వస్తున్నారని అన్నారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. 1 లక్ష. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సివిల్స్ అభ్యర్థులకు సింగరేణి సంస్థ అండగా నిలుస్తుందన్నారు. బీహార్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. దీన్ని ఆర్థిక సహాయంగా కాకుండా ప్రోత్సాహకంగా పరిగణించాలని అన్నారు. వీరంతా సివిల్స్ లో విజయం సాధించి తెలంగాణ రావాలని ఆకాంక్షించారు.
‘‘తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా రాష్ట్రం కోసం పని చేయాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే రికార్డు. పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేసి ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 563 గ్రూప్ 1 ఉద్యోగాలు కల్పించారు. 14 ఏళ్లుగా ఈ నియామకాలు జరగలేదు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వకూడదని, అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. గ్రూప్ 1పై జరిగిన అన్ని కుట్రలను భగ్నం చేసి పరీక్షలు నిర్వహించాం. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. మార్చి 31లోగా ఈ నియామకాలు పూర్తి చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.