POST OFFICE: పోస్ట్ ఆఫీస్ పథకాలకు కొత్త వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారిని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరాశపరిచింది. తాజాగా కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్తగా ప్రకటించిన రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికాలకు వర్తిస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుండి చిన్న పొదుపు పథకాలు ఈ క్రింది రేట్ల వద్ద వడ్డీని పొందుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో, అధిక డిమాండ్ ఉన్న సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ల వంటి అన్ని పథకాల వడ్డీ రేట్లు మార్చబడలేదు. అవి అలాగే ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి) నోటిఫై చేసిన వడ్డీ రేట్లు ఇప్పుడు ఏప్రిల్-జూన్ కాలానికి కూడా వర్తిస్తాయని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్రం మార్చకపోవడం వరుసగా ఇది ఐదవసారి కావడం గమనార్హం. కేంద్రం చివరిసారిగా ఈ పథకాల వడ్డీ రేట్లను 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో సవరించింది. ఆ తర్వాత కేంద్రం మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది. ఇందులో సుకన్య సమృద్ధి వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.20 శాతానికి చేర్చింది. కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సవరిస్తుంది.

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో 7.10 శాతం వడ్డీ రేటు ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో 7.7 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. అదే సమయంలో, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు కూడా 8.20 శాతం.

Related News

ఇతర పథకాల విషయానికి వస్తే.. పోస్టాఫీసు పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా 4 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. టైమ్ డిపాజిట్ల విషయానికి వస్తే, ఒక సంవత్సరం కాలపరిమితి గల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉండగా, రెండేళ్ల కాలపరిమితి గల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతంగా కొనసాగుతోంది. మూడేళ్ల కాలపరిమితి గల టైమ్ డిపాజిట్లపై 7.10 శాతం, ఐదేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.

ఏప్రిల్-జూన్ నెలలకు ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.7 శాతం కాగా, నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై వడ్డీ రేటు 7.40 శాతం. కిసాన్ వికాస్ పత్ర పథకంపై వడ్డీ రేటు 7.50 శాతం. ఇక్కడ, పెట్టుబడి సరిగ్గా 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.