దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి పెద్ద షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలపై ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమంలో జరిగిన వివాదం ఈ కేసుకు దారితీసినట్లు తెలుస్తోంది. దెందులూరులో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా, అబ్బయ్య చౌదరి వాహనం ఎమ్మెల్యే చింతమనేని వాహనాన్ని అడ్డుకున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
దెందులూరులో వాతావరణం వేడెక్కింది..
అబ్బయ్య చౌదరితో గొడవకు ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శలు వస్తున్నాయి. అయితే.. తన కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతోందని అబ్బయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో రాజకీయాలు వేడెక్కాయి.
వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరు అరెస్టు.. A1గా వంశీ
ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులపై వరుసగా కేసులు నమోదు అవుతుండటంతో పార్టీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారనే దానిపై నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ పోలీసులు నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.