ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈరోజు విజయవాడ వచ్చారు. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న ఈమె మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవల ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విడిపోయినప్పటికీ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా మెలుగుతున్న రేణు దేశాయ్ ఆయన పార్టీ జనసేనకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈరోజు ఆమె అనూహ్యంగా మరో రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికలకు ముందు బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఏపీలో భారత్ చైతన్య యువజన పార్టీ బీసీవై ఏర్పడింది. ఈ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. అయితే పార్టీ నేతల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈరోజు విజయవాడకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంతో కలిసి వచ్చిన ఆమె.. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా బీసీవై పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సావిత్రి బాయి ఫూలే జయంతి, మహిళా ఉపాధ్యాయుల గురించి మాట్లాడడానికే తాను నగరానికి వచ్చానని రేణు దేశాయ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు విజ్ఞానం ఎంతో అవసరమన్నారు. పిల్లల జీవితంలో తల్లి తర్వాత మహిళా ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని ఆమె అన్నారు. జ్యోతిబాయి ఫూలే స్ఫూర్తితో ఉపాధ్యాయులు, మహిళలు అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రేణు దేశాయ్ పిలుపునిచ్చారు. అయితే రాజకీయాలపై రేణు స్పందించలేదు.
గతంలో సినిమాలకు స్వస్తి చెప్పిన ఆమెకు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరాలని పిలుపు కూడా వచ్చింది. అయితే, ఆమె ఎప్పుడూ స్పందించలేదు. రాజకీయాల గురించి ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఆమె సోషల్ మీడియాలో పవన్ మరియు ఆమె పిల్లల గురించి మాత్రమే పోస్ట్ చేస్తుంది. అలాంటిది ఈరోజు ఆమె తన మాజీ భర్త పార్టీలో కాకుండా వేరే పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఊహాగానాలకు కారణమైంది.