ఒకటవ తేదీన జీతం ఎందుకు రాలేదో కాదు .. విద్యార్థులకు 70 శాతం మార్కులు ఎందుకు రావడం లేదో చూడండి.. బాధ్యతతో బోధించండి
గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
గన్నవరం, జూన్ 1: ‘‘పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారు.. టీచర్లు వచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతారు.. ఒకటవ తారీఖున జీతం పడిందో లేదో అనే దాని కంటే విద్యార్థికి 70 శాతం మార్కులు ఎందుకు రావడం లేదో ఆలోచించండి.. మీరైతే ఏంచేస్తారు. పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఎలా ..
మీకు కంపెనీ ఉంటే 40 శాతం మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇప్పిస్తారా?’’ అని గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. హైస్కూళ్ల తనిఖీలో భాగంగా శనివారం గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి ఉన్నత పాఠశాలలను ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీ చేశారు. ముందుగా గన్నవరం బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడారు.
10వ తరగతిలో ఎంతమందికి 70 శాతం మార్కులు వచ్చాయి అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఉపాధ్యాయులు దీనిపై మొత్తం శాతం చెప్పారు. దీనిపై ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు బాధ్యతగా బోధించడం లేదంటూ డీఈవో తాహెరా సుల్తానా సమాధానం చెప్పారు. నేను పిల్లవాడిని కాదు. ఐఏఎస్ ర్యాంకర్. ఆఫీస్‌లో కూర్చుని కూడా కూడా మీరు చెప్పే సమాధానం తెలుసుకోవచ్చు అని అన్నారు.
10వ తరగతి ఫలితాలు కావాలని పదే పదే చెబితే సరిపోదని, పునాది సరిగా లేని విద్యార్థికి 6వ తరగతి నుంచి ప్రాథమిక పాఠాలు బోధిస్తే ఫలితం ఇలానే ఉంటుందన్నారు. 10వ తరగతి సబ్జెక్టుల వారీగా 70 శాతం కంటే తక్కువ మార్కులు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన యూనిఫాంలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. సరిపోతుందా లేదా అని ఎంఈఓలను ప్రశ్నించారు.