ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బిసి సొరంగం వద్ద జరిగిన ప్రమాదం గురించి ప్రధాని ఆరా తీశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి మోడీకి వివరించారు. ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి అవసరమైన సహాయక చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సహాయక చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని పంపుతామని ప్రధాని మోడీ సిఎంకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందించడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలోని 14వ కిలోమీటరు వద్ద… సొరంగంలో మూడు మీటర్ల పక్క గోడ కూలిపోయింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం షిఫ్ట్‌లో పని కోసం 50 మంది సొరంగం లోపలికి వెళ్లారు. 42 మంది కార్మికులు ఒక్కొక్కరుగా సొరంగం నుండి బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో… వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు.