రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పీఎం కిసాన్ నిధుల విడుదలపై బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24న అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ. 2,000 విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే రోజు బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేస్తారు. ఈ కేవైసీ చేయాల్సిన ఎవరైనా వెంటనే చేయాలని అధికారులు సూచించారు. ఈ కేవైసీ పూర్తి చేస్తేనే రైతుల ఖాతాల్లోకి డబ్బు చేరుతుందని వారు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం విడతల వారీగా రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ. 6,000 అందిస్తున్నారు. ఇప్పటివరకు 18 విడతల ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 2,000 జమ అయ్యాయి. 19వ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఉన్నారు. వారందరికీ ఈ నెల 24న నగదు విడుదల అవుతుంది.
మరోవైపు AP అంతటా 42.04 లక్షల మంది అర్హులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున రూ. 840.95 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయబడతాయి. అనంతపురం జిల్లాలో 2.85 లక్షల మంది, విశాఖపట్నంలో అత్యల్పంగా 17 వేల మంది రైతులు PM కిసాన్ నిధులను అందుకుంటారు.