తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురంలో క్యాన్సర్ వ్యాధి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామంలో దాదాపు 200 మందికి క్యాన్సర్ సూచించే లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి వైద్య బృందాలను పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ కారణాలను తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. బలభద్రలో పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు. తరువాత మాట్లాడుతూ.. బలభద్రపురానికి 31 వైద్య బృందాలను పంపామని చెప్పారు. 10,800 మందిలో 8,530 మందిని పరీక్షించారు. ప్రస్తుతం 32 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాదని ఆయన అన్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ అంతటా 1.92 కోట్ల మందిని పరీక్షించామని ఆయన చెప్పారు. 1,45,649 అనుమానిత క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. 10-15 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.