ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. సోమవారం ఏప్రిల్ 1 నుండి అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ పెంపు వచ్చే నెల నుండి అమలు చేయబడుతుందని తెలిపింది. ఈ పెంపు గరిష్టంగా 4 శాతం వరకు ఉంటుందని, మోడల్‌ను బట్టి ధర మారుతుందని కంపెనీ వివరించింది. తయారీ వాహనాలలో ఉత్పత్తి ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయని, వీలైనంత వరకు ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే, నిరంతరం పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా దానిలో కొంత భాగాన్ని బదిలీ చేస్తున్నట్లు మారుతి సుజుకి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నిర్ణయంతో గత రెండు నెలల్లో మారుతి సుజుకి రెండవసారి ధరలను పెంచింది. ఫిబ్రవరిలో మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ.32,000 పెంపును ప్రకటించిన తర్వాత, ఈసారి దానిని మరో 4 శాతం పెంచడం గమనార్హం.
మరో దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా సోమవారం తన వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే ఈ పెంపు వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ముడిసరుకు, లాజిస్టిక్స్ ఖర్చుల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.