మార్కెటింగ్ సైబర్ నేరాలు: అత్యాశకు పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
“పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ! తక్కువ టైమ్‌లో.. ఎక్కువ ఆదాయం! ఇంట్లో నుంచే.. బీరువాల నిండా సంపాదించండి!” ఇలాంటి ప్రకటనలతో.. ముందూ వెనకా ఆలోచించకుండా.. అత్యాశకు పోయి ఎంతో మంది భారీగా నష్టపోతున్నారు. నెట్‌వర్కింగ్ పేరుతో కొందరు కేటుగాళ్లు నట్టేట ముంచేస్తున్నారు. బిజినెస్, ప్రొడక్ట్, మార్కెటింగ్ అంటూ తెలివిగా మోసం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఈ తరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా మేలుకోని.. తేరుకోకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల తీరుతెన్నులు:
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు తరచూ పేరు మార్చుకుంటూ, కొత్త స్కీమ్‌లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రివార్డులు, పాయింట్లు, రిఫర్ చేస్తే బోనస్‌లు వంటి ఆఫర్లతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ఆశ చూపుతున్నారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ, నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. పిరమిడ్ మోడల్ తరహా మోసాలు చేసే కేటుగాళ్లు.. తమ దగ్గర ప్రొడక్టులు కొని మార్కెట్‌లో విక్రయిస్తే.. భారీ లాభాలు వస్తాయని చెప్పి.. జనం ఆశల్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
పేరు మారుతుంది.. మోసం మారదు!
V-Can, Amway, Q Net, Vestige, Herbal Life, Sankalp Mart, DKZ Technologies, Friday Up Consultancies వంటి సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు ADMS ఈ-బైక్స్ పేరుతో కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ప్రతిసారీ కంపెనీ పేరు, బిజినెస్, స్కీమ్ మారుతున్నాయి కానీ.. స్కామ్ మాత్రం మారడం లేదు. లైఫ్‌లో సక్సెస్ అయ్యేందుకు.. దీనిని మించిన అవకాశం మరొకటి లేదని కథలు చెబుతూ.. అమాయకులను మోటివేట్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
ADMS ఈ-బైక్స్ స్కామ్:
ADMS ఈ-బైక్స్ కంపెనీ బైక్‌ల పేరుతో వ్యాపారం మొదలుపెట్టి.. ఆ బైక్‌లు అమ్మకుండా.. చైన్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోంది. రిజిస్ట్రేషన్, మెంబర్‌షిప్, ఐడీ జనరేషన్ అని చెబుతూ.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా మారుస్తోంది. జనం డబ్బుతో.. వాళ్లు వ్యాపారం చేస్తూ.. వేల కోట్లు వెనకేస్తున్నారు. కొద్దో గొప్ప డబ్బులకు ఆశపడి.. ఈ స్కీమ్‌లో ఏజెంట్లుగా చేరుతున్న వాళ్లెందరో ఉన్నారు.
విదేశాల్లో ఉండి పిరమిడ్ రాకెట్
సైబర్ మోసాలపై అవగాహన పెరగడంతో.. కేటుగాళ్లు మల్టీ లెవెల్ మార్కెటింగ్‌పై దృష్టి సారించారు. చైన్ బిజినెస్ పేరుతో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రకటనలు గుప్పించి.. అమాయకులను మోసగిస్తున్నారు. ఈ స్కీములు నడిపే కేటుగాళ్లలో.. చాలా మంది విదేశాల్లోనే ఉండి ఈ పిరమిడ్ రాకెట్ నడుపుతున్నారు. భారీ లభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట.. ఏజెంట్ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నారు.
జాగ్రత్తలు:
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ ల జోలికి వెళ్లొద్దు.
- మీ దగ్గరలో ఇలాంటి మీటింగులు జరిగితే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
- అత్యాశకు పోకుండా, ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
ప్రజలు ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.