హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ షోరూమ్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఎంబీ మాల్ సమీపంలోని మహీంద్రా వీవీసీ కంపెనీ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి, స్థానికులు, సిబ్బంది గమనించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 4 అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వాహనాలు కాలిపోయాయని సిబ్బంది తెలిపారు.
షోరూమ్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో 30 కార్లు ఉన్నాయని తెలిసింది. ఈ ప్రమాదంలో 12 ఖరీదైన కార్లు కాలిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.