వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ఈ ఉదయం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కొడాలి నాని గుండెపోటు వార్త తెలియగానే, వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఇంతలో, గుడివాడ నియోజకవర్గంలోని నాని అభిమానులు, అనుచరులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుండి, మాజీ మంత్రి కొడాలి నాని కొంతకాలంగా రాజకీయంగా చురుగ్గా కనిపించడం లేదు. ఆయన ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు ముందు ఉంటారు. అడపాదడపా హాజరవుతారు. ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన గుండెపోటు పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులలో ఆందోళన కలిగిస్తోంది. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై AIG వైద్యులు ఎటువంటి బులెటిన్ విడుదల చేయనప్పటికీ, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు కొడాలి నానిని ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.