
ఈరోజుల్లో మనకు ఎప్పుడెప్పుడు డబ్బు అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఆరోగ్యం, పిల్లల చదువు, పెళ్లి ఖర్చులు, గృహ నిర్మాణం ఇలా ఎన్నో అవసరాలు ముదురుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పొదుపు అనేది అవసరం అయ్యింది. పొదుపు చేసేందుకు చాలా మంది వేరే వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ, పొదుపు చేసే సమయంలో మీరు సెలెక్ట్ చేసే స్కీమ్ భద్రమైనదేనా, మంచి వడ్డీ ఇస్తుందా అన్నది ముఖ్యమైన విషయం.
ఇలాంటి టైంలో పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న కొన్ని గొప్ప పొదుపు పథకాలు మనకు ఎక్కువ వడ్డీతో పాటు పన్ను మినహాయింపు లాంటి ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఈ స్కీమ్‌లు మీకోసం స్పెషల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న ప్రధానమైన ఐదు పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.
ప్రతి నెల జీతంలా వడ్డీ రావాలంటే – పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: ఇది బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమే కాకుండా ప్రతి నెల వడ్డీ రావడంతో రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ పథకంలో 7.4% వార్షిక వడ్డీ లభిస్తోంది. ప్రతి నెల వడ్డీ కస్టమర్ ఖాతాలోకే జమవుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. సంయుక్త ఖాతాలో అయితే రూ.15 లక్షల వరకూ పెట్టుబడి చేయొచ్చు. అంటే నెలకు కనీసం రూ.5,550 వడ్డీ లభిస్తుంది.
వృద్ధులకు బంగారు కాలం – సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్: 60 సంవత్సరాల పైబడిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 8.2% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఖాతాలో జమవుతుంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌పై పన్ను మినహాయింపూ లభిస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ భద్రత కలిగిన పథకం కావడంతో పెద్దవాళ్లకు ఇది భరోసా కలిగించే ఆప్షన్.
నెలనెలా పొదుపు చేయాలనుకుంటే – రికరింగ్ డిపాజిట్ స్కీమ్: చిన్న ఉద్యోగులు, గృహిణులు వంటి వారు నెలనెలా తక్కువ మొత్తాన్ని పెట్టుబడి చేసి భద్రంగా పొదుపు చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. కనీసం రూ.100 నెలవారీగా పెట్టుబడి పెట్టొచ్చు. జులై-సెప్టెంబర్ 2025 త్రైమాసికానికి ఈ పథకంపై 6.7% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీకు డబ్బు వడ్డీతో సహా తిరిగి లభిస్తుంది.
అమ్మాయిల భవిష్యత్తు కోసం – సుకన్య సమృద్ధి యోజన: పొదుపు చేసి పిల్లల భవిష్యత్తు పటిష్టం చేయాలనుకుంటే ఇది ఉత్తమమైన స్కీమ్. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ పథకంలో ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇది బ్యాంకుల FD కంటే ఎక్కువ. కనీసం రూ.250 నుంచే ఖాతా ప్రారంభించొచ్చు. గరిష్ఠంగా ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు వరకు పెట్టుబడి చేయొచ్చు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు వచ్చే వరకు లేదా ఆమె పెళ్లి వరకు ఈ ఖాతా మెచ్యూర్ అవదు. ఈ పథకంలో పెట్టుబడి చేసేవారికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
డబ్బు రెట్టింపు కావాలా? – కిసాన్ వికాస్ పత్ర: ఇది పూర్తిగా భద్రత కలిగిన స్కీమ్. ప్రస్తుతం ఈ పథకంలో మీరు పెట్టిన డబ్బు సుమారు 115 నెలలలో రెట్టింపు అవుతుంది. అంటే 9.5 సంవత్సరాల్లో మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7.5% వార్షిక వడ్డీ ఉంది. ఈ పథకానికి ఎలాంటి గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. డబ్బు ఎక్కువగా ఉంటే ఎక్కువ పెట్టుబడి చేయొచ్చు. కనీస పెట్టుబడి మాత్రం రూ.1000.
ఇంకా బ్యాంక్ FDల్లోనే డబ్బు పెట్టి తక్కువ వడ్డీతో నష్టపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నడిపే ఈ పోస్టాఫీస్ పథకాలు పూర్తిగా భద్రంగా ఉండటమే కాకుండా ఎక్కువ వడ్డీ అందిస్తాయి. నెలనెలా ఆదాయం కావాలన్నా, పుట్టిన బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టుబడి కావాలన్నా, లేదా డబ్బు రెట్టింపు కావాలన్నా… పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి. కనీసం రూ.100 నుంచే ఈ పథకాలలో పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. భవిష్యత్తులో నిస్సహాయంగా ఉండకూడదంటే ఇప్పుడే ఒక మంచి పొదుపు పథకాన్ని ఎంచుకోండి…