
మన కళ్ల ఆరోగ్యం మన జీవనశైలిని చాలా ప్రభావితం చేస్తుంది. టీవీలు, మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం ఎక్కువవుతుండటంతో కంటిచూపు బాగా పడిపోతోంది. అలాంటప్పుడు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారమే ఉపాయం. కొన్ని పండ్లు, కూరగాయలు, గింజలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల కంటిచూపు పెరుగుతుంది. కళ్ళు మెరుస్తూ ఉంటాయి.
విటమిన్ ఎ ఉన్న ఆహారం కంటికి చాలా అవసరం. క్యారెట్లు ఇందులో మొదటివి. ఇవి తినడం వల్ల శరీరానికి బీటా కెరోటిన్ అందుతుంది. అది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీనివల్ల రాత్రి కంటిచూపు బాగా ఉంటుంది. కళ్ళు పొడిగా మారడాన్ని ఇది అడ్డుకుంటుంది. క్యారెట్లతో పాటు చిలగడదుంపలు కూడా బీటా కెరోటిన్‌ను ఇస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు కూడా మిస్ కాకుండా తినాలి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అలాగే గుమ్మడికాయ, మామిడి, బొప్పాయి, గుడ్డు పచ్చసొన కూడా ఎంతో ఉపయోగకరమైనవి.
ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటి రెటీనాలోని మక్యులా ప్రాంతాన్ని కాపాడుతాయి. ఇవి హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేస్తాయి. వయస్సు పెరిగిన తర్వాత వచ్చే కంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ పోషకాలు ఆకుకూరల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, కాలే తినడం వల్ల ఈ పదార్థాలు అందుతాయి.
[news_related_post]విటమిన్ సి కూడా కంటి ఆరోగ్యానికి కీలకం. ఇది కంటి రక్తనాళాల్ని కాపాడుతుంది. కంటిశుక్లం (క్యాటరాక్ట్) వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరికాయలు తినడం చాలా మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు కూడా రోజూ తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ ఇ కూడా ఓ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కంటి కణాల్ని రక్షిస్తుంది. కంటికి అవసరమైన విటమిన్ ఈ కోసం బాదం, వాల్నట్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. వాటి కోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. చియా గింజలు, అవిసె గింజలు కూడా తినవచ్చు.
జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, మాసం, గుడ్లు, నేరేడు పండ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆహారంలో భాగం చేయాలి. ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. ఇప్పుడు నుంచే మీ ఆహారపు పట్టికలో ఇవి చేర్చుకోండి. ఇంకాస్త ఆలస్యం చేస్తే కంటిచూపు తగ్గిపోతుంది. ఇప్పుడు మారండి – కళ్లకు కొత్త వెలుగు ఇవ్వండి!