Insurance: మెంటల్ హెల్త్‌పై బీమా ఉందా?.. అవసరం ఉందా?.. తెలుసుకోండి..

ఇప్పుడు సాధారణంగా ఉద్యోగులు ఎక్కువసేపు పని చేస్తున్నారు. ఆఫీసులో ఒత్తిడి పెరిగింది. డబ్బు కొరత, భవిష్యత్ భయం… ఇవన్నీ కలిసివచ్చి మానసిక ఆరోగ్యాన్ని భయంకరంగా ప్రభావితం చేస్తున్నాయి. కానీ ఇలాంటి సమస్యలపై బీమా సహాయం ఉందా అంటే ఆశ్చర్యంగా తక్కువ మంది మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఐఆర్‌డీఏఐ ఆదేశం ఉన్నా ఫలితం లేదు

ఇన్షూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్‌డీఏఐ ఇప్పటికే 2018లోనే మానసిక ఆరో్యాన్ని శారీరక ఆరోగ్యంతో సమానంగా చూడాలంటూ ఆదేశించింది. కానీ జనం మానసిక చికిత్స కోసం ఇన్షూరెన్స్ క్లెయిమ్స్ వేయడం గణనీయంగా జరగడం లేదు. మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 1 శాతం కన్నా తక్కువవి మాత్రమే మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి.

వాస్తవ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి

అంతే కాదు, మెంటల్ హెల్త్ బీమా ఉంటుందో లేదో 42 శాతం మంది ఉద్యోగులకు అసలు స్పష్టతే లేదు. బీమా ఉన్నవారిలో 83 శాతం కంపెనీలు మానసిక ఆరోగ్యంపై క్లెయిమ్ లేవు అని పేర్కొంటున్నాయి. అంటే ఉన్న బీమా కూడా వాడటం లేదు.

ఔట్‌పేషెంట్ చికిత్స లేదు అంటే బీమా విలువే లేదు

ఇది మరీ దారుణం – మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్, థెరపీ అవసరం. కానీ 100 మందిలో 17 మందికే ఇలాంటి ఔట్‌పేషెంట్ చికిత్స బీమాలో కవర్ అవుతోంది. మిగతావారికి డబ్బు ఖర్చు చేయడం తప్పదు.

చికిత్స ఖర్చు భరించలేరు

ఒకవైపు ఔట్‌పేషెంట్ కవర్ లేకపోవడం, మరోవైపు చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండటం ఉద్యోగులని చికిత్స నుంచి దూరంగా నెట్టేస్తోంది. 49 శాతం మంది ట్రీట్‌మెంట్ ఖర్చులే పెద్ద సమస్యగా భావిస్తున్నారు. దీని ఫలితం – చాలా మంది చికిత్స మొదలెట్టేంత వరకూ వేచి చూస్తారు లేకపోతే పూర్తిగా వదిలేస్తారు.

వెతికే చికిత్స కేంద్రాలు దొరకవు

ఒకవేళ చికిత్స చేయాలనుకున్నా – మీ బీమా నెట్‌వర్క్‌లో మానసిక ఆరోగ్య నిపుణులు దొరకటం చాలా కష్టం. 21 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని మించిన సమస్య – 48 శాతం మంది ఉద్యోగులు “చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో పనిలో వివక్ష ఎదురవుతుంది” అని భయపడుతున్నారు.

మానసిక ఆరోగ్యానికి ఇంకా చట్టపరమైన గ్యాప్‌లు

బహుళంగా కంపెనీలు డీ-అడిక్షన్ సెంటర్లు, రిహాబిలిటేషన్ సెంటర్లను బీమాలో చేర్చడం లేదు. మందుబాబులకు చికిత్స అవసరం అయినా ఇన్షూరెన్స్ మద్దతు ఉండదు. ఆత్మహత్య ప్రయత్నం వంటి విషయాలూ చాలాచోట్ల బీమా నిబంధనల వల్ల మినహాయింపులోకి వస్తున్నాయి.

‘రైజ్ అప్ ఫర్ ఎ బెటర్ టుమారో’ రిపోర్టు ఏమంటోంది?

ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ, ఎంపవర్‌తో కలిసి 2025లో ‘రైజ్ అప్ ఫర్ ఎ బెటర్ టుమారో’ అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక భారతదేశ మానసిక ఆరోగ్య బీమా వ్యవస్థలోని లోపాల్ని స్పష్టంగా చూపిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని బలపరిచేలా బీమా సంస్థలు, ఉద్యోగి వేతనదారులు, పాలసీ మేకర్లు కలసి పని చేయాలని సూచిస్తుంది.

రిపోర్ట్ సూచనలు

బీమా కవర్‌లో మానసిక ఆరోగ్య ఔట్‌పేషెంట్ చికిత్సలు, టెలి కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ వంటి వాటిని చేర్చాలని కోరింది. అలాగే మానసిక చికిత్స కేంద్రాలు, డీ-అడిక్షన్ సెంటర్లు బీమా నెట్‌వర్క్‌లో ఉండేలా చూడాలని చెప్పింది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలు సడలించాలి. సెల్ఫ్ హార్మ్, సబ్స్టెన్స్ యూజ్ డిసార్డర్లు వంటి వాటిపై మినహాయింపులు తొలగించాలని సూచించింది.

ఈ విషయం మీకు ఎందుకు అవసరం?

మీకు ఉద్యోగం ఉందా? మీకు ఆరోగ్య బీమా ఉందా? మీ బీమాలో మానసిక ఆరోగ్యం కవర్‌ అవుతుందా అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోండి. ఉన్నా వినియోగించుకోవడం నేర్చుకోండి. మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది.

లేకపోతే మనసు ఒత్తిడిలో మునిగిపోతుంది. ఉద్యోగం మీద, కుటుంబంపై ప్రభావం పడుతుంది. కనుక, మీరు, మీ కుటుంబ సభ్యులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. బీమా కవర్ ఉందా లేదా తెలుసుకోండి. లేకపోతే ఇప్పుడు చర్యలు తీసుకోండి.

ఈరోజే మీ ఆరోగ్య బీమా పాలసీ చెక్ చేయండి. మెంటల్ హెల్త్ కవర్ లేదంటే, దానితో పాటు ఉన్న పాలసీకి షిఫ్ట్ అవ్వండి. మీకు అవసరం ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలి. అది మీ భవిష్యత్తును రక్షించే కీలకమైన నిర్ణయం అవుతుంది.