
2025 సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేసే ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఫ్రీలాన్సర్ లు ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తున్నారు. అయితే ఎక్కువమంది వ్యక్తులు ఐటీఆర్ ఫార్మ్ నింపేటప్పుడు ఒకే తప్పు చేస్తున్నారు. దానికి కారణం – Form 26AS, AIS, TIS అనే కీలక డాక్యుమెంట్లు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే.
మీ ఆదాయపు పన్ను రిటర్న్ సరిగ్గా, వేగంగా, ఎలాంటి తప్పులు లేకుండా ఫైలింగ్ కావాలంటే ఈ మూడు ఫార్మ్స్ చాలా కీలకం. వాటి సహాయంతో మీరు ముందుగానే మీ ఆదాయ వివరాలు, టాక్స్ డిడక్షన్ వివరాలు, ఇతర పెట్టుబడుల సమాచారం తెలుసుకోగలుగుతారు. ఫలితంగా ఐటీఆర్ దాఖలు సమయంలో గందరగోళం లేకుండా మీ పని సాఫీగా పూర్తవుతుంది.
Form 26AS అంటే ఏంటి? ఈ ఫార్మ్‌ను మీరు టాక్స్ పాస్‌బుక్ అని భావించొచ్చు. మీరు ఆ సంవత్సరం మొత్తం చెల్లించిన టాక్స్, లేదా మీకు కట్ అయిన టిడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. మీరు ప్రాపర్టీ కొన్నపుడు TDS కట్ అయిందా, లేదా బ్యాంక్ లో డిపాజిట్లపై వడ్డీకి టిడీఎస్ కట్ అయిందా వంటి సమాచారమంతా ఈ ఫారమ్‌లో కనిపిస్తుంది.
[news_related_post]2023-24 నుంచి ఈ ఫార్మ్‌లో కేవలం TDS మరియు TCS సమాచారం మాత్రమే చూపిస్తున్నారు. ఈ వివరాలు TRACES పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇతర పెట్టుబడి, ఆదాయం వివరాల కోసం అయితే మీరు AIS ని చూడాలి.
AIS అంటే ఏమిటి? AIS అంటే Annual Information Statement. ఇది Form 26AS కంటే చాలా ఎక్కువ సమాచారం కలిగి ఉంటుంది. ఇందులో కేవలం టాక్స్ లేదా TDS/TCS సమాచారం మాత్రమే కాకుండా, మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు, డివిడెండ్, బ్యాంకు వడ్డీ, అద్దెకు ఇచ్చిన ఇల్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, విదేశాలకు పంపిన డబ్బు, ప్రాపర్టీ కొనుగోలు/అమ్మకం, GST టర్నోవర్ వంటి అనేక వివరాలు ఉంటాయి. ఇది పూర్తిగా ఆధునికమైన ఫార్మాట్. మీరు ఇన్కమ్ టాక్స్ E-Filing వెబ్సైట్ లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఇందులో ఉండే వివరాలు ఆధారంగా మీరు ఐటీఆర్ ఫారమ్‌ను నింపవచ్చు.
TIS అంటే Taxpayer Information Summary. ఇది AIS లో ఉన్న వివరాలపై ఆధారపడి వస్తుంది. అంటే మిమ్మల్ని సంబంధించి ఉన్న మొత్తం ఫైనాన్షియల్ సమాచారం ఒక చిన్న సారాంశ రూపంలో అందుతుంది. ఇందులో జీతం, వడ్డీ ఆదాయం, డివిడెండ్ లాభాలు ఇలా వర్గాలవారీగా సమాచారం ఉంటుంది.
ఇది మీ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. ఎందుకంటే మీరు Pre-filled ITR Form ను ఉపయోగిస్తే, ఈ TIS ఆధారంగా అన్ని వివరాలు ముందుగానే నింపబడతాయి. మీ పని ఇంకా తక్కువ సమయములో పూర్తవుతుంది. పైగా తప్పులు జరిగే అవకాశమూ తగ్గిపోతుంది.
ఈ మూడు డాక్యుమెంట్లను (Form 26AS, AIS, TIS) జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. ఎందుకంటే మీరు కట్టిన టాక్స్ వివరాలు, వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు ముందుగానే ఈ డాక్యుమెంట్లలో ఉంటాయి. మీరు అవి వేరుగా చెప్పకుండా ఉంటే Income Tax Department మీకు నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆదాయాన్ని చూపకపోతే లేదా గందరగోళంగా చూపిస్తే, అది టాక్స్ డిపార్ట్మెంట్కు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని డేటా ఇప్పుడు డిజిటల్. ప్రతి లావాదేవీ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, బ్రోకర్ ఫిర్మ్స్ Income Tax కి రిపోర్ట్ చేస్తున్నాయి.
మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి ముందు మీరు మొదటగా 26AS ఫారమ్, AIS స్టేట్మెంట్, మరియు TIS సారాంశం చూసుకోవాలి. వాటిలో ఉండే అన్ని వివరాలను మీ రాబడి వివరాలతో పోల్చండి. ఏమైనా తేడా ఉంటే ముందే సరిచేసుకోండి. తర్వాతనే ఐటీఆర్ ఫారం నింపడం మొదలుపెట్టండి. ఐటీఆర్ సరిగ్గా, మిస్టేక్స్ లేకుండా ఫైలింగ్ చేస్తే, రిఫండ్ ఉన్నవారికి డబ్బు త్వరగా బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. మిస్టేక్స్ లేకుండా ఫైలింగ్ చేయడం వల్ల ఆ తర్వాత నోటీసులు, వెరిఫికేషన్స్ వంటి సమస్యలు రావు. ముఖ్యంగా సెల్ఫ్ ఎమ్ప్లాయిడ్ వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, మల్టిపుల్ ఆదాయం ఉన్నవారు ఈ ఫార్మ్స్ తప్పక పరిశీలించాలి.
మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు Form 26AS, AIS, TIS అన్నీ చూస్తేనే పని సాఫీగా పూర్తవుతుంది. లేదంటే చివరికి మీరు మిస్ చేసిన ఆదాయం, వడ్డీలపై టాక్స్ చెల్లించని కారణంగా నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఆలస్యం చేయకండి. ఈ మూడు డాక్యుమెంట్లను ఓసారి డౌన్లోడ్ చేసి పరిశీలించండి. మీరు తెలియకపోయినా గవర్నమెంట్‌కి మీరు ఎంత సంపాదించారో, ఎంత పెట్టుబడి పెట్టారో అన్నీ స్పష్టంగా కనిపిస్తుంది.