గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సాధారణంగా ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీల కంటే ముందే తన ఐఫోన్‌లకు కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. అదే తరహాలో రాబోయే ఐఫోన్ 17 ఎయిర్ ఈ సంవత్సరం అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో విడుదల అవుతుందని ఇప్పటికే పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా.. ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఆపిల్ ఈ ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులు చేస్తుందని పేర్కొంది. ఈ మోడల్ ప్రధానంగా స్లిమ్ డిజైన్ కోసం కొన్ని కీలక అప్‌గ్రేడ్‌లను చేస్తోందని ఊహాగానాలు ఉన్నాయి. దానిలో భాగంగా, ఆపిల్ ఛార్జింగ్ పోర్ట్ లేకుండా ఐఫోన్‌ను తయారు చేయాలని యోచిస్తోంది.
భవిష్యత్తులో ఐఫోన్‌లు పూర్తిగా పోర్ట్-ఫ్రీగా ఉండేలా చూసుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనిపై ఆపిల్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఐఫోన్ 17 ఎయిర్‌లోనే ఈ పోర్ట్-ఫ్రీ సౌకర్యాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ విజయవంతమైతే భవిష్యత్తులో పూర్తిగా పోర్ట్-ఫ్రీ మోడళ్లకు మార్గం సుగమం చేస్తుందని ఆపిల్ అధికారులు భావిస్తున్నారు. ఆపిల్ చాలా సంవత్సరాలుగా పోర్ట్‌లెస్ ఐఫోన్ గురించి చర్చిస్తోంది. ఫిజికల్ సిమ్ ట్రే, డ్యూయల్ కెమెరాలు లేకుండా దీన్ని తీసుకురావాలని గతంలో చర్చ జరిగింది. 2021లో ఛార్జింగ్ పోర్ట్ లేకుండా మొదటి ఐఫోన్‌ను తీసుకురావాలని ఆపిల్ ప్లాన్ చేసిందని ఆపిల్ సప్లై చైన్ ఇన్‌సైడర్ మింగ్-చి కువో తెలిపారు. అయితే, సాంకేతిక, నియంత్రణ సమస్యల కారణంగా అది నిలిపివేయబడింది.