ఉస్మానియా విశ్వవిద్యాలయం తన పరిధిలో నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓయూ జారీ చేసిన ఈ సర్క్యులర్‌ను హైకోర్టు నిలిపివేసింది. ఓయూ అధికారులు ఈ నెల 13న ఓయూలో ధర్నాలు, నిరసనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సర్క్యులర్ భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అయితే, ఉస్మానియాలో నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తూ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని స్టాండింగ్ కౌన్సిల్ తెలిపింది. రెండు వైపుల వాదనల తర్వాత.. ఈ విషయంపై కౌంటర్ స్టేట్‌మెంట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు బెంచ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.