వేడిగాలులు: భానుడి భాగభ.. మండుతున్న ఎండలు.. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ధారిలో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బతో మహిళ మృతి.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
మార్చి 15: రాష్ట్రంపై భానుడు తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా సాధారణం కంటే పెరగడంతో, ప్రజలు పగటిపూట బయటకు రావడానికి భయపడుతున్నారు. శనివారం, ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్ధారిలో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40.6 డిగ్రీలు, నిజామాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 40.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలో 40.3 డిగ్రీలు, హనుమకొండ జిల్లాలో 40.2 డిగ్రీలు, వరంగల్ జిల్లాలో 39.01 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలో 39.7 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లాలో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Related News
ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో తాటి రత్తాలు (55) అనే మహిళ వడదెబ్బతో మరణించింది. చెల్లెలి కూతురు పెళ్లి సందర్భంగా పెళ్లి ఆహ్వానపత్రికలు పంచడానికి మూడు రోజులుగా బంధువుల ఇళ్లకు వెళ్లి వాంతులు, విరేచనాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయిందని బంధువులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచించారు.