విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు భారీ శుభవార్త అందింది. రిలయన్స్ కంపెనీ రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. 930 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు, 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు, రిలయన్స్ ఎస్ యూ సన్ టెక్ ప్రతినిధులు ఇప్పటికే కర్నూలు జిల్లాలోని భూములను పరిశీలించారు. రెండు స్థలాలను ఖరారు చేశారు.
దీనితో, రిలయన్స్ ఈ ప్రాజెక్టు పనులను త్వరలో ఏదో ఒక చోట ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, ప్రత్యక్షంగా 1,000 మందికి మరియు పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒప్పందం త్వరలో పూర్తవుతుందని వారు తెలిపారు. బిఓటి వ్యవస్థ కింద రిలయన్స్ ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వివిధ విద్యుత్ సంస్థలకు పంపిణీ చేస్తామని వారు తెలిపారు.