
ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ చెల్లింపులకు మరో పేరు UPI. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ వల్ల ప్రతి ఒక్కరి లైఫ్‌లో UPI కీలక పాత్ర పోషిస్తోంది. కానీ రోజురోజుకీ యూజర్ల సంఖ్య పెరుగుతుండటంతో, UPI సర్వర్లు తీవ్రంగా బిజీ అవుతున్నాయి. దీనివల్ల పేమెంట్లు ఫెయిల్ కావడం, బ్యాలెన్స్ చెక్ చేయలేకపోవడం వంటి సమస్యలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ పరిస్థితులను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెద్ద మార్పులను తీసుకువస్తోంది.
ఈ మార్పులు 2025 ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వాటి వల్ల మనం UPI ఎలా వాడుతున్నాం అన్న విధానం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా రోజూ చాలా సార్లు బ్యాలెన్స్ చెక్ చేసే వారు, ఒకే పేమెంట్‌ను పదే పదే చెక్ చేసే వారు ఇక జాగ్రత్త..! ఇకపై కొన్ని నిబంధనలు నిష్క్షేపంగా అమలు కానున్నాయి.
ఇకపై ప్రతి యాప్‌లో (ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం మొదలైనవి) ఒక్క రోజుకి బ్యాలెన్స్ చెక్ చేయడానికి గరిష్టంగా 50 సార్లు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే మీరు ఫోన్‌పేలో రోజుకి 50 సార్లు, గూగుల్‌పేలో మరో 50 సార్లు చెక్ చేయొచ్చు. కానీ అది మించి చెక్ చేస్తే ఆ యాప్‌లో బ్యాలెన్స్ చెక్ ఆపేస్తారు. ఈ నిర్ణయం వల్ల UPI సర్వర్లపై వచ్చే లోడ్ తగ్గుతుంది. మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను చూస్తే, ఒక్కరోజుకి 25 సార్లు మాత్రమే వీక్షించొచ్చు. ఈ లిమిట్ కారణంగా సర్వర్లపై అదనపు ట్రాఫిక్ తగ్గుతుంది.
[news_related_post]ఇప్పటివరకు Netflix, Hotstar, EMI, SIP లాంటి ఆటోపే పేమెంట్లు ఎప్పుడైనా జరిగేవి. ఇకపై అవన్నీ ఉదయం 10 గంటలకి ముందు, మధ్యాహ్నం 1 నుండి 5 మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే జరుగుతాయి. ఇది రష్ అవర్స్‌లో సర్వర్ మీద భారం తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం.
మీ పేమెంట్ ఫెయిల్ అయితే, మీరు మూడు సార్లకంటే ఎక్కువ దానికి స్టేటస్ చెక్ చేయలేరు. ఓ చెక్ చేసి ఇంకో చెక్ చేయాలంటే 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి. ఇది కూడా సర్వర్‌పై పదేపదే Refresh చేయడం వల్ల వచ్చే లోడ్‌ను తగ్గించేందుకు తీసుకున్న చర్య. 2025 జూన్ 30 నుంచి చెల్లింపు చేసే ముందు, మీరు పంపబోయే వ్యక్తి అసలైన పేరు (బ్యాంక్‌లో రిజిస్టర్ అయిన పేరు) యాప్‌లో చూపుతుంది. దీనివల్ల పొరపాటుగా డబ్బు వేరే వాళ్లకు వెళ్లే ప్రమాదం తగ్గుతుంది. ఫ్రాడ్ కేసులపై ఇది బ్రేక్ వేస్తుంది.
2024 డిసెంబరులో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇప్పుడు 30 రోజుల్లో గరిష్టంగా 10 సార్లు మాత్రమే చార్జ్‌బ్యాక్ క్లెయిమ్ చేయొచ్చు. అదే వ్యక్తి లేదా కంపెనీపై ఐదు సార్లు మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. ఇది చార్జ్‌బ్యాక్ మిస్యూజ్ని అడ్డుకుంటుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా UPI ద్వారా నెలకు సుమారుగా 16 బిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2025 ఏప్రిల్, మే నెలల్లో అనేక మంది యూజర్లు సేవలు స్లోగా ఉండటం, పేమెంట్ ఫెయిల్ అవటం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. వాటికి ప్రధాన కారణం యూజర్లు పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం, పేమెంట్ ఫెయిల్ అయితే Refresh చేస్తూ ఉండడం.
దీని వల్ల సర్వర్‌పై భారం పడుతోంది. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనల వల్ల సర్వర్‌పై భారం తగ్గి, UPI సిస్టమ్ మరింత వేగంగా, సురక్షితంగా, స్థిరంగా పనిచేస్తుంది.
మీరు UPI ఎక్కువగా వాడే వారు అయితే, 2025 ఆగస్ట్ 1 తర్వాత మీ వాడకాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే చిన్న పనులు కూడా పూర్తి కాకపోవచ్చు. తాజా మార్పులన్నీ UPIను బెటర్‌గా మార్చేందుకు తీసుకొస్తున్నారు. కనుక ఈ మార్పులపై సమాచారం ఉండటం తప్పనిసరి. మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ విషయం షేర్ చేయండి.