బంగాళాఖాతం: ఇప్పటి వరకు కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అక్కడి రిజర్వాయర్లు, భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటి ప్రాజెక్టులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి.
ఇప్పుడు ఈ పరిస్థితికి బ్రేకులు ఉండకపోవచ్చు. మరో రౌండ్ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తమిళనాడు వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో వీస్తున్న బలమైన తూర్పు గాలుల్లో చోటుచేసుకుంటున్న మార్పులే ఈ వర్షాలకు కారణం.
Related News
ఈ తూర్పు గాలుల వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, బంగాళాఖాతంలోని నైరుతి-దక్షిణ ప్రాంతాలలో బలమైన తూర్పు గాలులు వీస్తాయి.
దీని ప్రభావంతో రానున్న 72 గంటల పాటు అంటే ఈ నెల 8వ తేదీ వరకు చెన్నై సహా తమిళనాడు అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పుదుచ్చేరి, కారైకల్‌లోనూ ఇదే జోరు కనిపిస్తుందని అంచనా. అదే సమయంలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది.
వర్షాలతో పాటు నీలగిరి, దిండిగల్, కోయంబత్తూరు, సేలం వంటి జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్, కోటగిరి, కూనూర్, ఏర్కాడ్, ఏలగిరి, కులుక్కుమలై, జవధు కొండల్లో పొగమంచు దట్టంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
చెన్నై సహా పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 15 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కామరాజ్ సాగర్ (శాందినల్ల) రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. తేని, కోయంబత్తూరు జిల్లాల్లోని పశ్చిమ కనుమల పక్కనే ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.