ఏపీలో మరో భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో మరో స్వల్ప భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.43 గంటలకు భూమి కంపించింది.
దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొందరు.. పరుగులు తీశారు.
అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూకంపానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, వారు కొన్ని కారణాలను అందించారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం కావడంతో స్వల్ప భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా మరో చిన్నపాటి భూకంపం రావడంతో జనం కాస్త భయాందోళనకు గురయ్యారనే చెప్పాలి.
గతంలో కూడా
గతంలో కూడా ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది. జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 10.34 గంటల సమయంలో శబ్దాలతో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం తాళ్లూరు మండలం పోలవరం, శంకరాపురం, తూర్పు కంభంపాడు, వేంపాడు, మారెళ్ల, పసుపుగల్లు, ముండ్లమూరు, శంకరాపురం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.