డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పుస్తకాల పట్ల అమితమైన ఆసక్తి చూపేవారు. వాటిని కొనడం, చదవడం ఆయనకు ఎంతో ఇష్టం. పెద్దయ్యాక పుస్తకాలు, పఠనం పట్ల ఆయన ఆసక్తి మరింత పెరిగింది. ఆయన దాదాపు 7,000 నుండి 8,000 పుస్తకాలను సేకరించారు. ఈ పుస్తకాల మొత్తం విలువ సుమారు రూ. 30,000 నుండి రూ. 40,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ప్రచురితమైన ఒక పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, ఎస్క్వైర్‘ అనే పేరుతో అంబేడ్కర్ జీవించి ఉండగానే ఆయన జీవిత చరిత్ర గురించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. ఈ పుస్తకాన్ని గుజరాతీలో రాశారు. దీని రచయిత యు.ఎం. సోలంకి. 1940 ఆగస్టులో ఈ పుస్తకం ప్రచురితమైంది. ఇదొక విలువైన చారిత్రక పత్రంగా నిలిచింది. 1940 వరకు అంబేడ్కర్ జీవితం గురించి ఈ పుస్తకం వివరించింది.
అంబేడ్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కుల సమాఖ్యతో సంబంధం ఉన్న గుజరాత్‌కు చెందిన ప్రముఖ నాయకుడు కర్షందాస్ లెయువా, అంబేడ్కర్ జీవిత చరిత్ర రాయించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ, రాయడానికి ఒకరు కావాలి. ఆ సమయంలో విద్య నుంచి కుల బహిష్కరణ కారణంగా చదువుకున్న దళితులు చాలా తక్కువమంది ఉండేవారు. ఎవరైనా ఆ పుస్తకాన్ని రాసినా ఎంతమంది దళితులు చదువుతారనే సందేహాలు కూడా ఉండేవి. దీంతో పుస్తకం రాయడానికి యు.ఎం. సోలంకి అనే వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు.
పుస్తకం రాయడానికి యు.ఎం. సోలంకి అనే వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, పుస్తకానికి పీఠికను కూడా రాశారు కర్షందాస్. “1933లోనే నేను అంబేడ్కర్ జీవిత చరిత్ర రాయాలని అనుకున్నాను. ఆ సమయంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేడ్కర్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అయితే, గుజరాతీలకు ఆయన గురించి తక్కువ తెలుసు. 1937లో కుమార్ అనే పత్రిక సంపాదకీయాలలో అంబేడ్కర్ జీవితం గురించి చదివాను. ఆ తర్వాత ఆయన జీవితం గురించి నాకు ఆసక్తి మరింత పెరిగింది. అవసరమైన సమాచారాన్ని సేకరించాలని నా స్నేహితుడు సోలంకికి చెప్పాను. ఆయన అంబేడ్కర్‌పై విలువైన సమాచారాన్ని సంపాదించారు.’’ అని ముందుమాటలో రాశారు కర్షందాస్.
ప్రచురణకు డబ్బు పెద్ద అడ్డంకిగా మారింది. కంజీభాయ్ దవే కొంత విరాళంగా ఇచ్చారు. ఇక పూర్తి ఖర్చును భరించాలని నిర్ణయించుకున్నారు కర్షందాస్. రచయిత సోలంకి, కర్షందాస్ లెయువా, దాత కంజీభాయ్ దవే ఫోటోలను ఈ పుస్తకంలో ముద్రించారు. 1940 ఆగస్టు నాలుగో వారంలో ఈ పుస్తకం ప్రచురితమైంది. అహ్మదాబాద్‌లో దరియాపూర్‌లోని మహాగుజరాత్ దళిత నవ్ యువక్ మండల్ ప్రచురించగా, మన్సూర్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించారు. పుస్తకం ధర అని రాసి: ‘అమూల్యం’ అని పేర్కొన్నారు. అంటే ఆ సమయంలో పుస్తకం ఉచితం.
సోలంకి అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్ రోడ్‌లోని రాణికుంజ్లో ఉండేవారు. ప్రొఫెషనల్ రచయిత కాకపోయినా అంబేడ్కర్ ఆలోచనలు, రచనలతో బాగా పరిచయం ఉంది. కర్షందాస్ మాదిరే సోలంకి కూడా అంబేడ్కర్ వాది, ఆయన రచనల ఆరాధకుడు. ఇంగ్లిష్, గుజరాతీ భాషలు రెండింటిపైనా సోలంకికి పట్టుంది. ఈ పుస్తకం రాయడానికి అంబేడ్కర్ ప్రసంగాలు, రచనలన్నింటినీ ఆంగ్లంలో అధ్యయనం చేశారు. అంబేడ్కర్ భావజాలంపై సోలంకికి ఉన్న వ్యక్తిగత అవగాహన అంబేడ్కర్ జీవిత చరిత్రను స్పష్టంగా, ఖచ్చితత్వంతో రాయడానికి సహాయపడింది.
1940లోని అంబేడ్కర్ జీవిత చరిత్రను అమిత్ ప్రియదర్శి జ్యోతికర్ 2023లో తిరిగి ప్రచురించారు. ఈ పుస్తకం విస్తృతంగా పాఠకులను చేరుకోవడానికి ఆంగ్లంలోకి అనువదించారు. కొత్త ఎడిషన్‌లో గుజరాతీ వచనంతో పాటు, ఆంగ్ల అనువాదం కనిపిస్తుంది. “పుస్తకాన్ని ఒరిజినల్ ఎడిషన్‌లో ఉన్నట్లే ప్రచురించాం. వ్యాకరణ దోషాలు, భాషను కూడా అలాగే ఉంచాం. ఇది కేవలం పుస్తకం కాదు, ఒక చారిత్రక పత్రం. అంబేడ్కర్ మొదటి జీవిత చరిత్ర గుజరాతీలో ఉందని ప్రపంచానికి తెలియజేయాలని మేం కోరుకుంటున్నాం.” అని అమిత్ జ్యోతికర్ అన్నారు.
రెండోసారి ఈ చారిత్రక పుస్తకం ప్రచురణలో మహారాష్ట్రకు చెందిన రచయిత విజయ్ సుర్వాడే కీలక పాత్ర పోషించారు. అంబేడ్కర్ రెండో భార్య సవితకు సన్నిహిత సహచరుడు ఈ విజయ్ సుర్వాడే. చారిత్రక పత్రాలను సేకరిస్తుంటారు విజయ్ సుర్వాడే. ఆయన స్వయంగా ఫోటోగ్రాఫర్ కూడా. ఆ అభిరుచిలో భాగంగా అంబేడ్కర్ జీవిత చరిత్రపై గుజరాతీలో రాసిన మొదటి పుస్తకం పేజీలను 1993లో ఆయన ఫోటోలు తీశారు. కాగా, అమిత్ జ్యోతికర్ 2020లో అంబేడ్కర్ జీవిత చరిత్రను తిరిగి పబ్లిష్ చేయాలని అనుకున్నారు.
అయితే, అప్పటికి, అసలు పుస్తకం బాగా దెబ్బతిని ఉంది. చదవడమూ కష్టంగానే ఉంది. అయితే, విజయ్ సుర్వాడే తన వద్ద ఉన్న పుస్తకం ఫోటోలను అమిత్ ప్రియదర్శికి ఇచ్చారు. దీంతో పునఃప్రచురణ సాధ్యమైంది. ఈ పుస్తకం 1940లో అంబేడ్కర్ జీవించి ఉండగానే రాశారు. దాని ప్రచురణ తర్వాత ఆయన మరో 16 సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలో ఆయన చాలా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. చివరికి బౌద్ధ మతంలోకి మారారు.
1940 తరువాత సంఘటనలు పుస్తకంలో లేవు, కానీ అది దాని ప్రాధాన్యతను తగ్గించదు. అంబేడ్కర్ ప్రారంభ జీవితంతో పాటు ఆయన గురించి చాలా తక్కువగా తెలిసిన అంశాలను ఈ పుస్తకం వివరించింది. ఉదాహరణకు, పుస్తకంలో నాసిక్‌లో జరిగిన యేవాలా సెషన్ గురించి రాశారు. ఆ సమావేశంలో అంబేడ్కర్: ‘నేను హిందువుగా జన్మించినప్పటికీ, హిందువుగానే చనిపోను’ అనే ప్రకటన చేశారు. 1956లో నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ అధికారికంగా బౌద్ధమతంలోకి మారినప్పటికీ, నాసిక్‌లో ఆయన చేసిన ప్రకటన అంబేడ్కర్ ఆధ్యాత్మిక, సైద్ధాంతిక పరివర్తనకు నాంది పలికింది.
ఈ పుస్తకం లాహోర్‌లో జరిగిన ఒక అనూహ్య సంఘటనను కూడా వివరించింది. అక్కడ కులంపై మాట్లాడటానికి జాత్ పాట్ తోడక్ మండల్ అనే సంస్థ అంబేడ్కర్‌ను ఆహ్వానించింది. అయితే, ప్రసంగ పాఠాన్ని చదివిన నిర్వాహకులు దానిని చాలా తీవ్రంగా భావించి అంబేడ్కర్ ఆహ్వానాన్ని రద్దు చేశారు. దీంతో అంబేడ్కర్ అక్కడ ప్రసంగం చేయలేకపోయారు. అయితే, తరువాత ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ అనే పుస్తకంలో ఆ ప్రసంగం ప్రచురితమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కులతత్వంపై శక్తిమంతమైన విమర్శగా మిగిలిపోయింది. ఈ మొదటి జీవిత చరిత్ర అంబేడ్కర్ విద్య, భారత్, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసిద్ధ ప్రసంగాలు, ప్రపంచ నాయకులు, మేధావులతో ఆయన సంభాషణల గురించి వివరణాత్మక వర్ణనలను అందిస్తుంది. ఇది మహాత్మాగాంధీ, అంబేడ్కర్ మధ్య సైద్ధాంతిక విభేదాలను కూడా ప్రస్తావిస్తుంది. కులం, మతంపై అంబేడ్కర్ అభిప్రాయాలను పుస్తకంలో క్షుణ్ణంగా చర్చించారు.