మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హాస్టల్ బాత్‌రూమ్‌లలో కెమెరాలు అమర్చడాన్ని గమనించిన విద్యార్థులు రహస్యంగా వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
వీడియోలు రికార్డు చేసింది హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రైవసీకి భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన హాస్టల్‌లోని విద్యార్థుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.