ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అన్నదానం సత్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి సత్రంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముంతాజ్ హోటల్, దేవలోక భూమి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఆస్తులను ఆక్రమించబోమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్తులను ఎవరైనా ఆక్రమించుకుంటే, వాటిని తిరిగి తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలలో, విదేశాలలో వెంకటేశ్వర ఆలయాలు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా ఉన్న తిరుమలలోని మతేతర ఉద్యోగుల సమస్య గురించి సీఎం మాట్లాడారు. హిందువులు తిరుమలలో పనిచేయాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులందరూ తిరుమలకు వెళ్లారు.