తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ప్రముఖ నటులు, యాంకర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. అయితే, ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో, రాష్ట్రం వ్యసనాలకు బలైపోకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రస్తుతం రాష్ట్రంలో వివాదానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కి బదిలీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్‌ల కేసులన్నీ సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ఈరోజు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుంది. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి వివరాలను అప్పగించారు.
ఈ బెట్టింగ్ యాప్‌లు యువతకు ఆర్థిక నష్టాన్ని కలిగించాయని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇందులో భాగంగా, బెట్టింగ్ యాప్‌లను చట్టవిరుద్ధంగా ప్రోత్సహించినందుకు పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో అనేక మంది ప్రముఖ నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి.