ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఇంగ్లిష్, తెలుగులో జీఓ ఎంఎస్ నంబర్ 3ను విడుదల చేసింది.
ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలకపాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే రాష్ట్రంలో తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయడం సమంజసమని ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఏపీలో తెలుగు భాషను ప్రథమ భాషా రాష్ట్రంగా విలీనం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొంది.
ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఇంగ్లిష్‌లో ఉత్తర్వులు జారీ చేసి రెండు రోజుల్లో తెలుగులో అప్‌లోడ్ చేయడం లేదా ముందుగా తెలుగులోనే జారీ చేసి రెండు రోజుల్లో ఇంగ్లీషు లేదా రెండు భాషల్లో ఒకేసారి ఉత్తర్వులు జారీ చేసే వెసులుబాటును కల్పించింది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ వివిధ శాఖలను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోకి అనువదించేందుకు అనువాద డైరెక్టర్ సేవలను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.