హస్తకళాకారుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని ‘ఆదరణ’ పథకంతో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకంలో ఎంపికైన వారికి రెండు విడతల్లో రూ.3 లక్షల రుణం అందజేస్తారు. బ్యాంకులు వసూలు చేసే 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 5 శాతం వడ్డీని లబ్ధిదారులు చెల్లించాలి. అయితే లబ్ధిదారులు చెల్లించే ఐదు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండా రుణం అందనుంది.
ఆ రుణంలో కూడా కొంత రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చేతివృత్తులపై ఆధారపడి ఎంత మంది ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్వే తర్వాత ఆదరణ- విశ్వకర్మ యోజన అమలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబరు 17, 2023న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. హస్తకళలు మరియు సాంప్రదాయ ఉపకరణాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయం అందించాలనే లక్ష్యంతో ఇది స్థాపించబడింది.