రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 10వ తేదీ (శుక్రవారం) నుంచి సెలవులు ప్రారంభమవుతాయని చెప్పారు.
19వ తేదీతో సెలవులు ముగుస్తాయని, 20వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే క్రైస్తవ పాఠశాలలకు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సెలవులు ఉంటాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవులు కుదించనున్నట్టు ప్రాథమిక ప్రచారం జరిగింది.
గతేడాది కురిసిన వర్షాలకు సెలవులు ఇచ్చారు. సంక్రాంతి వేళ వాటిని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న చర్చ సాగింది. అయితే సెలవులను తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావడంతో.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. కాగా, తెలంగాణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యాశాఖ ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ రెండో శనివారం, 12వ తేదీ ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి.