విశ్వవిద్యాలయాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించడానికి UGC NET పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ పరీక్షలు మొత్తం 85 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా తాజాగా UGC NET ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు (ఆదివారం) ఉదయం UGC NET డిసెంబర్ 2024 ఫలితాలను విడుదల చేసింది.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక https://ugcnet.nta.ac.in/ వెబ్సైట్లో వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా వారి స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జనవరిలో పరీక్షలు జరిగాయి. దీనికి సంబంధించిన కీని ఈ నెల 3న (ఫిబ్రవరి) విడుదల చేశారు. 6.49 లక్షల మంది అభ్యర్థులు UGC NET పరీక్షకు హాజరయ్యారు. 5,158 మంది అభ్యర్థులు JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హత సాధించగా, 48,161 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్లకు అర్హత సాధించగా, 1,14,445 మంది PhDకి అర్హత సాధించారు.