Valabhaneni vamsi: వంశీకి వరుస షాక్​లు.. తాజాగా ఆయనపై భూకబ్జా కేసు..!

వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరుస షాక్ లను ఎదుర్కొంటున్నారు. ఆయన అవినీతి కుంభకోణాలపై సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్ననే సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో బాధితులు ఆయనపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా గన్నవరం, వీరవల్లి పోలీస్ స్టేషన్లలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ.10 కోట్ల విలువైన భూమిని ఆక్రమించినందుకు కేసు నమోదైంది. హైకోర్టు న్యాయవాది సుంకర సీతా మహాలక్ష్మి పేరుతో ఉన్న భూమిని ఆక్రమించినందుకు ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అదేవిధంగా వీరవల్లిలో ఆయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై పది రోజుల క్రితం హైదరాబాద్ లో వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈరోజు ఆయనను మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు రెండు పీటీ వారెంట్లు జారీ చేశారు. దీని వల్ల ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు తగ్గిపోయాయి. నిన్న వంశీ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో నేడు సిట్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. పది కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. సిట్ ఏర్పాటుతో మరిన్ని బాధితులు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తారని భావిస్తున్నారు.