
ఖర్చుల తగ్గింపు చర్యల నేపథ్యంలో ఇంటెల్ సుమారు 5,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఒరెగాన్, అరిజోనా, టెక్సాస్‌లలో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో ఈ లేఆఫ్స్ అమలవుతున్నాయి. హెచ్ఆర్, మార్కెటింగ్, బ్యాక్‌ఆఫీస్ వంటి విభాగాల్లో ఎక్కువగా కోతలు విధించారు. సంస్థను మరింత వేగవంతమైన, సమర్థవంతమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటెల్ తెలిపింది.
ఈ ఏడాది మార్చిలో ఇంటెల్‌కు కొత్త CEOగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ (Lip-Bu Tan) ఆధ్వర్యంలో సంస్థలో భారీ పునర్వ్యవస్థీకరణ మొదలైంది. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించాలనే యోచనతో, ముందస్తుగా ఈ తొలగింపులు చేపట్టింది. ఈ చర్యల ద్వారా ఈ ఏడాది సుమారు 500 మిలియన్ డాలర్ల ఖర్చులు తగ్గించాలన్నది లక్ష్యం కాగా, 2026 నాటికి దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆదాయ ప్రయోజనం పొందాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే టెక్నాలజీ, ఏఐ, ఫౌండ్రీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతూ, అవసరం లేని విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించేందుకు సంస్థ దృష్టి సారించింది. తొలగింపులకు గురైన ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీలు, హెల్త్ బెనిఫిట్స్ వంటి పరిహారాలు అందించనున్నట్లు ఇంటెల్ స్పష్టం చేసింది.
[news_related_post]