తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనులకు వెళ్లేవారు మధ్యాహ్నం బయటకు రావడానికి భయపడుతున్నారు. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడితో పాటు చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని సందేశం ఇచ్చింది. ఈ నెల నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. తాజా హెచ్చరిక ప్రకారం.. సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్, జగిత్యాల, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ నెల 21, 23 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. ఈ వార్తతో తెలంగాణ ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.