గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట చల్లని గాలులు, ఉదయం మంచు దుప్పట్లు వీస్తున్న వాతావరణం ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తోంది. ఇంతలో ఈ సంవత్సరం వర్షం, చలితో పాటు, భారీ ఎండలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం.. మార్చి ప్రారంభంలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుండి వచ్చే ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మార్చి 13 నుండి 18 వరకు అధిక వేడి, వేడి గాలులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అవసరమైతేనే బయటకు వెళ్లాలి, ఎండలో నడిచేవారు.. వేడిని తట్టుకునేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా పుష్కలంగా నీరు త్రాగడం, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది, ఎక్కువసేపు వాహనాలు నడిపేవారు తెల్లటి కాటన్ చొక్కాలు ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ద్విచక్ర వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించడం మంచిదని, చిన్న చిన్న పనులను సాయంత్రం వరకు వాయిదా వేసుకోవాలని అధికారులు కూడా చెబుతున్నారు. అదేవిధంగా, వ్యవసాయ పొలాల దగ్గర మూగ జంతువులను చెట్ల కింద కట్టి, వాటికి ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉంచడం మంచిది.